ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇది దగా కాదా..?
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇది దగా కాదా..?

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇది దగా కాదా..?

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇది దగా కాదా..?

Thursday, Feb 28, 2019
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి,

నమస్కారములు.

ప్రధానమంత్రిగా మీరు బాధ్యతలు చేపట్టి ఇప్పటికి 57 నెలలు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమల్లోకి వచ్చి 59 నెలలు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు చేయాలని, అప్పటి ప్రధాన మంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ముఖ్యమంత్రిగా నేను స్వయంగా ఢిల్లీకి 29సార్లు వచ్చి అనేక వినతులు ఇచ్చాను.

వివిధ సందర్భాలలో ఆంధ్రప్రదేశ్ కు మీరు వచ్చిన ప్రతి సందర్భంలోనూ మళ్లీ మా వినతులు గుర్తు చేశాం. అయిదేళ్లు అవుతున్నా మాకు రావాల్సినవి ఏవీ పూర్తిగా నెరవేర్చలేదు. ఈ రోజు మీ విశాఖ పర్యటనకు సరిగ్గా ఒక్కరోజు ముందు రైల్వే మంత్రి శ్రీ పీయూష్ గోయల్ విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ప్రకటన చేశారు. 172 ఏళ్ల చరిత్రగల వాల్టేర్ డివిజన్ ను రద్దు చేసి జోన్ ప్రకటన ద్వారా రూ.6,500 కోట్ల నష్టం చేయడం ఏపి పట్ల మీ అక్కసును మరోసారి బైటపెట్టింది. కె.కె. లైన్ గూడ్స్ రాబడిని రాయగఢ్‌ డివిజన్ లో చేర్చి, పాసింజర్ల ద్వారా వచ్చే స్వల్ప రాబడి మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చి మరోసారి మోసం చేశారు. స్థానిక డివిజన్‌ లేకుండా, రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ లేకుండా జోన్ ఏర్పాటు చేయడం భారతదేశ రైల్వే చరిత్రలో ఎక్కడైనా ఉందా..? ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తారా..? ఇది మోసం కాదా, దగా కాదా..? ఎవరిని మోసం చేస్తారు మీరు...? ఇంకా మోసపోవడానికి మా ప్రజలు సిద్దంగా లేరు.

4 ఏళ్ల క్రితం హుద్ హుద్ బాధితుల పరామర్శ మీకు గుర్తుందా..? అప్పుడు మీరు ప్రకటించిన రూ.1,000కోట్లలో ఇంకా రూ.360 కోట్లు విడుదల చేయక పోవడం దగా కాదా..? మోసం కాదా..? నిన్నగాక మొన్న జరిగిన తిత్లీ బీభత్సంలో సర్వం కోల్పోయిన సిక్కోలు వాసులకు కనీసం మీ పరామర్శే లేకుండా చేశారే, ఇదేమైనా ధర్మమేనా..? వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకోవడం దేశ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా..?

ఈ 5 ఏళ్లలో మీరు చేసిన అన్యాయాలు, మోసాలు, నమ్మకద్రోహంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు రగిలిపోతున్నారు. మీ అధర్మపాలనపై మేం చేస్తున్న ధర్మపోరాటానికి 13జిల్లాలలోనే కాదు, అన్ని రాష్ట్రాలలో, యావత్ దేశంలో స్పందన ఉన్నప్పటికీ మీరు, మీ పార్టీలో కనీస స్పందన లేకపోవడంపై మండిపడుతున్నారు. గత 5ఏళ్ల మీ పనితీరుపై ఏపి ప్రజల్లో ఏవిధమైన ఆగ్రహావేశాలు ఉన్నాయో మరోమారు మీ విశాఖ పర్యటన సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మీరు చేసిన నమ్మకద్రోహాన్ని ఈ రోజు మరోసారి 5కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రతినిధిగా నిలదీస్తున్నాను. ప్రజల మనోభావాలు అర్ధం చేసుకోవడం వారి ప్రతినిధిగా మన బాధ్యతగా తెలియజేస్తున్నాను.
1) 2014 ఏప్రిల్ 20న అప్పటిప్రధానమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు‘ప్రత్యేక హోదా’ ఇప్పటిదాకా ఎందుకు ప్రకటించలేదు..? అన్ని పార్టీల ఆమోదంతో ఆ రోజు రాజ్యసభలో మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చలేదు. 14వ ఆర్ధిక సంఘం పేరుచెప్పి మమ్మల్ని మోసగించి, ప్రత్యేక హోదా ప్రయోజనాలను 11 రాష్ట్రాలకు కొనసాగిస్తూ, ఏపికి మొండిచేయి చూపడం నమ్మక ద్రోహం కాదా..? బిజేపియేతర పార్టీలన్నీ ఏపి హోదాకు మద్దతు ఇచ్చినా, పార్లమెంటులో మిమ్మల్ని నిగ్గదీసినా మాకు హోదా ఇవ్వకపోవడం ద్రోహం కాదా..?
2)పోలవరం ప్రాజెక్టు కోసం మేము ఖర్చు చేసిన రూ.4,063 కోట్ల బకాయిలను గత 8 నెలలుగా ఇవ్వకుండా పెండింగ్ పెట్టడం, డీపీఆర్-2ను ఆమోదానికి కొర్రీల మీద కొర్రీలు వేయడంఆంధ్రప్రదేశ్ పట్ల మీ కక్షసాధింపు ధోరణి కాదా?
3) ‘కాగ్’నిర్దారించిన తొలి ఏడాది రెవిన్యూలోటు రూ.16 వేల కోట్లను విడుదల చేయకుండా, కేవలం రూ.3,979 కోట్లు ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని తొక్కిపెట్టడం 5కోట్ల ప్రజలను మోసగించడంకాదా..?
4) ఢిల్లీని తలదన్నే రాజధానినిర్మించుకోండని మాటల్లో చెప్పి, చేతల్లో మాత్రం కేవలం రూ.1500కోట్లు మాత్రమే ఇస్తే మీరన్న రాజధాని నిర్మాణం సాధ్యమేనా..? కొత్త రాజధాని నిర్మాణానికి రూ.లక్షల కోట్లు కనీసం అవసరం కాగా, తొలిదశలో రూ.62 వేల కోట్లు కావాలని అడిగితే, నాలుగేళ్లలో 3సార్లుగా ఇచ్చింది రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చిముఖం తిప్పుకోవడం మోసం కాదా..? ఇంకో రూ.1000కోట్లు రాజధానికి ఇస్తామని చెప్పి తప్పించుకోవడం ద్రోహం కాదా..?
5) కె.బి.కె. తరహా అని, బుందేల్ ఖండ్ పాకేజి అని చట్టంలో స్పష్టంగా చెబితే, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర 7 జిల్లాలకు ఈ మూడేళ్లలోకేవలం రూ.1050 కోట్లు ఇచ్చి, నాలుగో ఏడాది మా ఖాతాలో జమ చేసిన రూ.350 కోట్ల నిధులను మా అనుమతి లేకుండా వెనక్కి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధం కాదా?
6) కావాల్సినంత ఖనిజ వనరులు, భూమి, నీటి వసతి, విద్యుత్, పారిశ్రామిక రాయితీలు తదితర సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్రం ముందుకు వచ్చినా కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయకపోవడం నమ్మక ద్రోహం కాదా..? మేము భూమి, నీరు, విద్యుత్ ఇతర రాయితీలు ఇస్తాం, మీరు పెట్టండి, లేదా మేము పెడతాం మీరు రాయితీలు ఇవ్వండని అడిగినా మొండి చేయి చూపడం ద్రోహం కాదా..?
7) 11 జాతీయ విద్యా సంస్థలకు మేము 2,909 ఎకరాల భూమిని ఇస్తే, మీరు ఇవ్వాల్సిన రూ.12,825 కోట్లకు గాను, కేవలం రూ.895 కోట్లు ఇవ్వడం దగా కాదా..? ఈ స్వల్ప నిధులతో ఆ సంస్థల నిర్మాణానికి ఎన్ని దశాబ్దాల కాలం పడుతుందో మీకు తెలియదా...? అప్పటిదాకా మా విద్యార్ధులను ఇబ్బందుల్లోకి నెట్టడం ధర్మమేనా..?
8) నెల్లూరు జిల్లాదుగ్గరాజపట్నం పోర్ట్‌ నిర్మాణం తొలిదశ 2018 కల్లా పూర్తిచేయాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా, మీరు కుంటిసాకులతో చేపట్టకపోవడం ఆంధ్రప్రదేశ్ పట్ల మీ నిర్లక్ష్యం కాదా?
9)ఢిల్లీ-ముంబై ఇండస్ర్టియల్ కారిడార్ అభివృద్ధికి రూ.17,500 కోట్లు ఇచ్చి ఆ రాష్ట్రాలపై ప్రేమ కురిపించిన మీరు మా రాష్ట్ర పరిధిలోని విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్‌ (VCIC)కు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి రుణం తీసుకోమనడం ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్షత కాదా?
10) అసలే రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ను కాకినాడ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు అయ్యే వయబులిటీ గ్యాప్ ఫండింగ్‌ను 15 ఏళ్ల పాటు భరించమనడం భావ్యమేనా?
11) విభజన చట్టంలోని పన్నులకు సంబంధించిన లోపాలవల్ల ( ఉమ్మడి రాష్ట్రంలో నెలకొల్పబడి ప్రస్తుతం ఏపికి మాత్రమే పరిమితమైన పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు) ట్యాక్స్ రిఫండ్ భారం రూ.3,820కోట్ల భారం ఆంధ్రప్రదేశ్ పై పడింది. ఆ నష్టాన్ని భర్తీచేసే బాధ్యత మీకు లేదా..?
12) విశాఖ, విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు డీపీఆర్‌లు 2016లోనే పంపిస్తే బెంగళూరు, భోపాల్, ఇండోర్ మెట్రో రైళ్లు, ముంబై సబర్బన్ రైళ్లకు వేల కోట్ల నిధులిచ్చిన మీరు మాకు మాత్రం మొండిచెయ్యి చూపించడం ధర్మమా? మధ్యప్రదేశ్ 2 మెట్రోలకు రూ.7వేల కోట్లకు మీ కేబినెట్ ఆమోదం తెలిపింది కానీ, మా మెట్రోలకు ఆమాత్రం నిధులు ఇవ్వడానికి మీకు చేతులురాలేదా...?
13) కొత్త రాజధాని అమరావతికి ర్యాపిడ్ రైల్ నెట్‌వర్క్, రోడ్ కనెక్టివిటీకి కొర్రీల మీద కొర్రీలు వేస్తూ పెండింగ్‌లో పెట్టడం దగా కాదా..?
14) విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టుల విస్తరణకు వందల ఎకరాల భూములు మేమిచ్చినా పూర్తిస్థాయిలో విస్తరణ చేపట్టకుండా, జాతీయ, అంతర్జాతీయ సర్వీసులు రాకుండా అడ్డుపడటం మా అభివృద్ధికి ఆటంకం కాదా?
15) 175 శాసనసభ స్థానాలను 225 స్థానాలకు పెంచాలని చట్టం సుస్షష్టంగా పేర్కొన్నా ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోకపోవటం రాజకీయ కుట్ర కాదా?
16) గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు ఇప్పటికీ కేంద్ర హోం శాఖ ఏ చర్యలూ తీసుకోకపోవడం అన్యాయం కాదా?
17) షెడ్యూల్ 9, 10 కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంస్థలు మరియు ఢిల్లీలోని ఏపి భవన్ ఆస్తుల విభజనకు తెలంగాణా సహకరించనప్పుడు, మీరు చొరవ తీసుకోకపోగా, సుప్రీం కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా మీరు ఆస్తులు, అప్పుల పంపిణీలో అన్యాయం జరిగేలా ఆదేశాలు జారీచేయడం దుర్మార్గం కాదా?

మా 60ఏళ్ల కష్టాన్ని వదులుకుని వచ్చాం, పునాదులనుంచి రాష్ట్రాన్ని నిర్మిస్తున్నాం. 5ఏళ్లయినా రాష్ట్ర విభజన గాయాలు ఇంకా మానలేదు, పుండుపై కారం జల్లేలా మీ పర్యటనలతో, మీ వ్యాఖ్యలతో మా గాయాలను మరింత పెంచడం మానవత్వమేనా..?

పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, పార్లమెంటు చేసిన పునర్విభజన చట్టంలోని అంశాలను అమలుచేయకుండా నిర్లక్ష్యం చేసి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడిచి ఇప్పుడు మీరురిక్తహస్తాలతో మా రాష్ట్రానికి రావడం తలవంపులుగా లేదా..? బాధ్యతాయుతమైన అత్యున్నత పదవిలో ఉన్న మీరు ఈ అంశాలన్నింటికీ వివరణ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ 5కోట్ల ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.
 
ఇట్లు
భవదీయుడు
(నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి)
Write Comments
Comments 13
Similar Updates