హోటళ్ల రాకతో అమరావతికి రాజధాని కళ
హోటళ్ల రాకతో అమరావతికి రాజధాని కళ

హోటళ్ల రాకతో అమరావతికి రాజధాని కళ

హోటళ్ల రాకతో అమరావతికి రాజధాని కళ

Thursday, Jan 17, 2019
ఎన్ని హోటల్ గదులు వస్తే రాజధానిలో అంత త్వరగా ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. విమానయాన సేవలు, కళాశాలలు, విద్యాసంస్థలు, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లే కొత్త నగరాల భవితవ్యాన్ని నిర్దేశించే వనరులని అన్నారు. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) సమావేశంలో 7 ప్రముఖ ఫైవ్ స్టార్ హోటళ్లకు భూ కేటాయింపు ధృవీకరణ లేఖలు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణాలతో అమరావతికి పూర్తిస్థాయి రాజధాని కళ వచ్చేసిందని అన్నారు.

ఏడు హోటళ్లకు కేటాయింపు ధృవీకరణ లేఖలు అందించారు. ఇందులో 5 నక్షత్రాల హోటళ్లు ఐదు, 4 నక్షత్రాల హోటల్ ఒకటి, 3 నక్షత్రాల హోటళ్లు నాలుగు ఉన్నాయి. జీవీ ఎస్టేట్ అండ్ హోటల్స్ (వివెంటా), ఓంశ్రీ భావనసాయి ఎల్ఎల్‌పీ (వెస్ట్ ఇన్), సదరన్ ట్రావెల్స్ (మ్యారియెట్), కాంథారి హోటల్స్ (ఫార్య్చూన్), అంబికా అగరబత్తీస్ ఆరోమా (రెజెంటా ఇన్), స్ప్లెండర్ ల్యాండ్ బేస్ (జింజర్), స్వాగత్ మోటల్స్ (కీస్ సెలెక్ట్) ఇందులో ఉన్నాయి. దీంతో రాజధానిలో నిర్మాణమయ్యే హోటళ్ల సంఖ్య 16కు చేరింది.
రాజధానిలో కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థ (డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్)ను గ్యాస్, వాటర్, విద్యుత్, రోడ్, ఫైబర్ గ్రిడ్ తరహాలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్‌ ఏర్పాటు అంశంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఒక ఉన్నత స్థాయి బృందం కొద్దిరోజుల క్రితం ఇక్కడికి వచ్చి పరిశీలించి వెళ్లిందని సీఆర్‌డీఏ కమిషనర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ఉన్న దుబాయ్ మెట్రోలోనూ, అబుదాబిలోని ఇథిహాద్ టవర్స్‌లోనూ ఈ వ్యవస్థను ఇప్పటికే వీరు విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. 40 వేల టన్నుల సామర్ధ్యంతో అమరావతిలో ఏర్పాటుచేస్తున్న డి.సి.ఎస్. ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థగా నిలుస్తుందని చెప్పారు.

రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనులను స్వయంగా చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున ఇక్కడికి వస్తున్నారని పురపాలక మంత్రి పి. నారాయణ ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులలో వస్తున్న వారి సంఖ్య రోజుకు 4వేల వరకు ఉండగా, రేపటి నుంచి ఆ సంఖ్య మరింత పెరిగే సూచనలు వున్నాయని మంత్రి చెప్పారు. నిత్యం 10 వేల మంది రాజధాని సందర్శించేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. సందర్శకుల కోసం ఉద్దండరాయపాలెంలో బేస్‌క్యాంప్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సందర్శకులు అక్కడే స్నానపానాలు ముగించుకునేందుకు వీలుగా డ్రెస్సింగ్ రూమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. అక్కడే భోజనాలు, అల్పాహారం అందిస్తున్నామని, ప్రత్యేకంగా 36 మంది టూరిస్టు గైడ్లను నియమించామని వివరించారు. సందర్శకులకు గుర్తింపు కార్డులు అందజేస్తున్నామని, యాత్ర ముగించుకుని తిరిగి వెళ్లేటప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం అడుగుతున్నందున అక్కడ కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

జ్యూడిషియల్ కాంప్లెక్స్‌లో రూ.23.15 కోట్లతో అడ్వకేట్ బ్లాక్
రాజధానిలో సిద్ధమవుతున్న జ్యుడిషియల్ కాంప్లెక్స్‌కు అనుబంధంగా 71,506 చదరపు అడుగుల విస్తీర్ణంలో అడ్వకేట్ బ్లాక్‌ను నిర్మించాలని శుక్రవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ సమావేశం నిర్ణయించింది. రూ.23.15 కోట్ల అంచనా వ్యయంతో జీ ప్లస్ 4 ఫ్లోర్లతో 140 క్యాబిన్లు, 16 షాపులుగా ఈ బ్లాక్ నిర్మాణాన్ని చేపట్టాలన్న ప్రతిపాదనకు సమావేశం ఆమోదం తెలిపింది. ఒక్కొక్క అంతస్థులో 35 ఛాంబర్లు చొప్పున నాలుగు అంతస్థుల్లో నిర్మాణాలు చేపడతారు. గ్రౌండు ఫ్లోరులో నాలుగు కార్యాలయాలు, ఆడిటోరియం, లైబ్రరీ, సర్విస్ రూమ్స్, కామన్ లాబీ ఏరియా, టాయిలెట్లు నిర్మిస్తారు. దీనికి త్వరలో టెండర్లు పిలుస్తారు.

వెంకటపాలెం సమీపంలో ఐటీ పార్కు
రాజధాని గ్రామమైన వెంకటపాలెం సమీపంలో రూ.448 కోట్లతో ఐటీ పార్కు నిర్మాణాన్ని చేపట్టాలన్న ప్రతిపాదనకు ఈ సమావేశం ఆమోదం తెలిపింది. మొత్తం 14,21,000 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో చేపట్టే ఐటీ పార్కులో 10 లక్షల చదరపు అడుగుల వరకు ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తుంది. ఇందులో సగభాగం వాణిజ్యపరమైన కేటాయింపులకు పోను, మిగిలిన సగభాగాన్ని దిగ్గజ సంస్థల కోసం అందుబాటులో ఉంచుతామని సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. ఒక సెల్లార్, 4 స్టిల్ట్స్, 15 పైఅంతస్థులతో ఐటీ పార్కు నిర్మాణాన్ని చేపట్టాలని ప్రతిపాదించినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలుస్తారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ కోసం ఫోస్టర్ ప్లస్ పార్టనర్స్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్‌కు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు.

హ్యాపీనెస్ట్ సిరీస్‌లో భాగంగా రెండవ ప్రాజెక్టు చేపట్టాలన్న ప్రతిపాదనపై సమావేశం ఆమోదం తెలిపింది. మొత్తం 1704 ఫ్లాట్లు, 12 బ్లాకులుగా ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఐనవోలు దగ్గర ఇది నిర్మాణం అవుతుంది. సెల్లార్, పోడియం, జి ప్లస్ 23 విధానంలో దీన్ని చేపడతారు.

రాజధానిలో 150 ఎకరాలలో నిర్మాణ రంగ నగర నిర్మాణాన్ని చేపట్టేందుకు సమావేశంలో ప్రాథమికంగా అనుమతి లభించింది. దీన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తారు. నిర్మాణ ప్రణాళిక స్థాయి నుంచి నిర్మాణ సామాగ్రి తయారీ వరకు కనస్ట్రక్షన్ సిటీలో అందుబాటులో ఉంటాయి.

నాణ్యతా నిర్ధారణ నియమావళి (క్వాలిటీ కంట్రోల్ మాన్యువల్)ని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఎండీ లక్ష్మీ పార్ధసారధి పాల్గొన్నారు.
Write Comments
Comments 4
Similar Updates