చిత్తూరు జిల్లా రైతుల జేజేలు
చిత్తూరు జిల్లా రైతుల జేజేలు

చిత్తూరు జిల్లా రైతుల జేజేలు

చిత్తూరు జిల్లా రైతుల జేజేలు

Tuesday, Jan 22, 2019
  • కృష్ణా జలాల రాకపై హర్షాతిరేకాలు
  • ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు
హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తిచేసి కృష్ణా జలాలు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చిత్తూరు జిల్లా ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. మూడు దశాబ్దాల కల నెరవేర్చిన చంద్రబాబు నాయుడుకు తాము జీవితాంతం రుణపడి ఉంటామని, ఆయన జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. భవిష్యత్‌లోనూ అండగా నిలుస్తామని చప్పట్లతో మద్దతుపలికారు. చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు తరలివచ్చిన శుభసందర్భంగా ఆ జిల్లా రైతులతో మంగళవారం ముఖ్యమంత్రి ఉండవల్లిలోని నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

రాయలసీమ వంటి నీటి ఎద్దడి వున్న ప్రాంతాలకు అసాధ్యం అనుకున్న నీటి సరఫరాను సుసాధ్యం చేశామని, హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు చిత్తూరు జిల్లాకు తీసుకువచ్చి నూతన చరిత్ర సృష్టించామని రైతులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి అన్నారు. ఇన్నేళ్లుగా తనను ఆశ్వీరదించిన అందరి రుణాన్ని ఈ రూపంలో తీర్చుకున్నానని చెప్పారు. చిత్తూరు జిల్లా టీడీపీకి కంచుకోటని, పార్టీ జెండాను ఇన్నాళ్లూ జిల్లా ప్రజలు మోశారని, వారిని ఆదుకోవడం తన బాధ్యతని అన్నారు.

కాలువ గట్లపై నిద్రపోయా : ముఖ్యమంత్రి
2014లో మదనపల్లి వచ్చి కాలువ దగ్గరే నిద్ర చేశానని, ఎంతో కష్టపడి నీటిని తీసుకువచ్చానని గుర్తు చేసుకున్నారు. ఈ నీటితో మన చిత్తూరు ప్రజల తలరాతలు మారతాయని చెప్పారు. కోనసీమను మించి అభివృద్ధి సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని, జిల్లాకు ఇంకా చాలా చేస్తామని తెలిపారు.

కృష్ణా జలాలు చిత్తూరు జిల్లాకు తీసుకురావడం వెనుక చాలామంది కృషి చేశారని ముఖ్యమంత్రి అన్నారు. మంత్రులు, స్థానిక నేతలు, ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, నిర్మాణ సంస్థల యజమానులు ఎంతో కష్టపడ్డారని ప్రశంసించారు. ఇందుకు సహకరించిన అందరికీ అభినందనలు తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

జల హారతులు ఇవ్వండి
‘పవిత్రమైన భావనతో కృష్ణా జలాలను వినియోగించుకోవాలి. జల హారతులు ఇవ్వండి. ప్రతి ఊరిలో స్వాగతం పలకండి. పండుగ వాతావరణం కనిపించాలి. శాశ్వతంగా మనకు జలాలు వుండేలా భగవంతుణ్ని ప్రార్ధించండి. మీ భవిష్యత్ చూసే బాధ్యత ప్రభుత్వానిది. అందరిలో చైతన్యం రావాలి. ఇప్పుడు జరిగిన సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి మద్దతుపలకాలి.’ అని ముఖ్యమంత్రి కోరారు.

పర్యాటకానికి అనుకూలం
మదనపల్లి, పుంగనూరు, కుప్పం వంటి ప్రాంతాల్లో వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుందని, ఇన్నాళ్లూ నీటి ఎద్దడి కారణంగా వెనుకబడ్డాయని ఇప్పుడు సాగునీటి రాకతో ఆ సమస్య తీరిందని ముఖ్యమంత్రి అన్నారు. ఇక్కడ వాతావరణం, ఉద్యానవనాలు, జలవనరులతో తంబల్లపల్లి, మదనపల్లి, కుప్పంకు పర్యాటకులు తాకిడి పెరుగుతుందన్నారు.

వచ్చే ఏడాదిలో ముందుగానే జలాలు
‘వచ్చే ఏడాది ఇంకా ముందుగానే చిత్తూరు జిల్లాకు నీరు తీసుకువస్తున్నాం. జిల్లాలో 10 ప్రధాన కాలువలను వినియోగించుకుని నీటి సరఫరా చేస్తాం. రిజర్వాయర్లు, చెరువులు నీటితో నింపుతాం. 40 చెరువులకు నీరిస్తాం. భూగర్భజలాలు అనూహ్యంగా పెంచుతున్నాం.’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

నరేంద్ర మోదీ మాటల ప్రధాని
నదుల అనుసంధానంపై ప్రధాని నరేంద్ర మోదీ మాటలకే పరిమితమయ్యారని, తాను చేసి చూపించానని ముఖ్యమంత్రి చెప్పారు. గోదావరి-కృష్ణా సంగమం ద్వారా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని, వంశధార నుంచి పెన్నా వరకు అన్ని నదులు అనుసంధానం చేస్తామన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు తీసుకువస్తే, హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టుల ద్వారా కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకువెళ్తున్నామని తెలిపారు.

కర్నూలులో వర్షం పడితే కుప్పంకు నీరిస్తాం
కర్నూలులో వర్షం పడితే కుప్పం ప్రాంతానికి నీరు ఇచ్చేలా జలవనరుల నిర్వహణ సమర్ధవంతంగా చేపడతున్నామని ముఖ్యమంత్రి అన్నారు. గండికోట నుంచి రెండు టీఎంసీల నీటిని తీసుకువచ్చే పనులు త్వరలో ప్రారంభిస్తామని, అలాగే జిల్లాలోని పశ్చిమ తాలుకా దాహార్తిని తీరుస్తామని హామీ ఇచ్చారు. అడవిపల్లి నుంచి నేరుగా చిత్తూరుకు జలాలను తరలిస్తామని, చిట్టచివరన ఉన్న మూలపల్లి వంటి చెరువులను నింపుతామని ప్రకటించారు.

29న మదనపల్లికి ముఖ్యమంత్రి
మదనపల్లికి ఈ నెల 29న కృష్ణా జలాలు చేరుకుంటాయని, ఆరోజు తాను మదనపల్లి వస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలను తీసుకురావడం తన జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. ఇది ఎంతోమంది చిరకాల వాంఛ అని, శ్రీకృష్ణ దేవరాయలు వంటి వారు తవ్విన చెరువుల్లో ఇన్నాళ్లూ నీరు లేకుండా పోయాయని, ఇప్పుడు ఆ కష్టాలు తీరాయన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇప్పటికీ కాటన్ దొరను దేవుడిలా కొలుస్తున్నారంటే దానికి కారణం ఆ జిల్లాలకు నీరు అందివ్వడమే కారణమని, అదీ నీటికి వున్న ప్రాధాన్యతని చెప్పారు.

నీరు బంగారంతో సమానం
నీరు బంగారంతో సమానమని, ప్రతి చుక్క సద్వినియోగం చేసుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. వరి పంటల కంటే తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ ఆదాయం వచ్చే ఉద్యానపంటల వైపు రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. సూక్ష్మ సేద్యం కోసం ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను రైతులు అందిపుచ్చుకోవాలన్నారు. రాయలసీమలో హార్టీకల్చర్, సెరికల్చర్‌కు ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. అనంతపురం జిల్లా ఉద్యానవనాల సాగులో ముందుందని, హార్టీకల్చర్, సెరికల్చర్ వల్లే గోదావరి జిల్లాల కన్నా రాయలసీమ జిల్లాలు ఎక్కువ ఆదాయం ఆర్జిస్తున్నాయని ముఖ్యమంత్రి వివరించారు.

టమోటాలు ఎగుమతి చేద్దాం
చిత్తూరు జిల్లా పశ్చిమ తాలూకా పండ్లతోటలు, కూరగాయలు, సెరికల్చర్‌కు అత్యంత అనుకూలమని, ఈ ప్రాంతంలో టమోటాలను పెద్దఎత్తున పండిస్తే మనం ప్రపంచానికి టమోటాలు ఎగుమతి చేద్దామని ముఖ్యమంత్రి రైతులకు పిలుపునిచ్చారు. టమోటాలు మొన్నమొన్నటి వరకు కిలో రూ.40 ధర పలికిందని, సరైన ప్రణాళికతో సాగు చేస్తే రైతులకు అధిక ఆదాయం సమకూరుతుందన్నారు. ప్రతి రైతు ఆదాయం పెరగాలని, దీనికి సంప్రదాయ పంటల సాగును పక్కన పెట్టాలన్నారు.

సంక్షోభం నుంచి సంతోషం వైపు..
‘నాలుగు సంవత్సరాల క్రితం రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అయినా జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టును పట్టుదలగా 65% పూర్తి చేశాం. సముద్రంలో కలిసే గోదావరి జలాల్లో కొన్ని అయినా వినియోగించుకోగలిగితే మనం విజయం సాధించినట్టే.’ అని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్ర మైనా వ్యవసాయంలో 0.2% మాత్రమే వృద్ధి సాధిస్తే, ఆంధ్రప్రదేశ్ 11% వృద్ధి సాధించిందని, మనలో 55వ వంతు మాత్రమే తెలంగాణలో వ్యవసాయరంగం వృద్ధి కనిపించిందని వివరించారు.

పసుపు-కుంకుమగా మరో రూ.10 వేలు
పెన్షన్లు రెట్టింపు చేశామని, పసుపు-కుంకమ కింద ఇప్పటికే స్వయం సహాయక సంఘం సభ్యులు ఒకొక్కరికి రూ.10 వేలు ఇచ్చామని, మరో రూ.10 వేలు త్వరలో ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతులకు రూ.24 వేల కోట్ల రుణ మాఫీ చేయగా, వచ్చే నెలలో మిగిలిన మొత్తాన్ని మాఫీ చేసి ఉపశమనం కలిగిస్తామన్నారు. అన్నకేంటిన్లు, చంద్రన్నబీమా, గృహనిర్మాణం.. ఇవన్నీ అమలు చేయగలిగామంటే అదంతా ప్రజల ఆశీస్సులు, చలువేనని చెప్పారు. మళ్లీ అందరూ ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి కోరారు.
Write Comments
Comments 11
Similar Updates