మహా సంకల్పం
మహా సంకల్పం

మహా సంకల్పం

మహా సంకల్పం

Friday, Jun 08, 2018
మన రాష్ట్రానికి అవినీతి, అశాస్త్రీయ విభజన వల్ల జరిగిన నష్టాన్ని నా కష్టంతో పూరిస్తానని, నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలను సమర్ధంగా ఎదుర్కొంటానని ఈరోజు నేను మహా సంకల్పాన్ని చేస్తున్నాను.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను, నాటి ప్రధానమంత్రి చట్టసభలో ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేసేంత వరకు ధర్మపోరాటాన్ని కొనసాగిస్తానని మహా సంకల్పం చేస్తున్నాను. మన రాష్ట్ర సర్వతోముఖ వికాస సాధనకు, 13 జిల్లాల సమగ్ర అభివృద్ధికి ఈరోజు నేను మహా సంకల్పాన్ని చేస్తున్నాను. 2004-2014 మధ్య పది సంవత్సరాలు సాగిన దగాకోరు పాలనలో పతనావస్థకు చేరిన రాష్ట్రాన్ని చక్కదిద్ది నాలుగేళ్ల వ్యవధిలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రభుత్వానికి మనసా, వాచా, కర్మణా మద్దతిస్తున్నాను.

కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, మన రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా నిలపాలన్న కృతనిశ్చయంతో ఈ నాలుగేళ్లు రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపించిన రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తాను. ఈ ఏడాది 15.91 శాతం ఆర్థిక వృద్ధి సాధించాలనే ప్రభుత్వ ధ్యేయానికి సహకరించి, తలసరి ఆదాయం లక్షా 70 వేల రూపాయిలు సాధించేందుకు నావంతు కృషి చేస్తాను. ప్రపంచానికే తలమానికంగా వుండేలా మన అమరావతిని ప్రజారాజధానిగా నిర్మించుకోవాలన్న మహా సంకల్పాన్ని చేస్తున్నాను.

రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం నుంచి 2019 నాటికి గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వాలని, ప్రాధాన్యక్రమంలో చేపట్టిన 54 జలవనరుల ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, నదుల అనుసంధానించాలనే ప్రభుత్వ లక్ష్యానికి మద్దతుగా నిలుస్తాను. చెక్ డ్యాంలు నిర్మాణం, చెరువుల్లో పూడికతీత, పది లక్షల పంట కుంటల తవ్వకంతో 3 నుంచి 8 మీటర్ల లోతులోనే భూగర్భజలాలు వుండేలా చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తోడ్పాటునందిస్తాను. సమర్థ నీటి నిర్వహణ చేపట్టి నా రాష్ట్రాన్ని కరువు రహితంగా మలచుకుంటాను. ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వాలని సంకల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతాపూర్వకంగా సహకరిస్తాను.

వ్యవసాయ కుటుంబాల ఆదాయం ప్రతి ఐదు సంవత్సరాలకు రెండింతలు పెంచడానికి, మత్స్య, పాడి, కోళ్లు, రొయ్యలు, పట్టు పరిశ్రమల అభివృద్ధికి పాటుపడతానని, ఉద్యాన వనాల పెంపకం పెద్దఎత్తున చేపట్టి రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో కరువును తరిమికొట్టి పేదరికంపై గెలుపు సాధిస్తానని మహాసంకల్పం చేస్తున్నాను.

రైతాంగం రెట్టింపు ఆదాయం సాధించేలా, ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ వైపు మళ్లేలా అవగాహన కల్పిస్తానని, కోటి ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని, కోటి ఎకరాల్లో ఉద్యాన పంటల సాగును నా వంతుగా సాఫల్యం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జీవ వ్యర్ధాలతో సేంద్రీయ ఎరువుల తయారీకి ప్రాధాన్యత ఇస్తాను.

సంక్షేమ రంగానికి పెద్దఎత్తున నిధులను ఖర్చు చేసి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించి, సమాజంలో అన్నివర్గాలకు సమాన అవకాశాలను కల్పించడం ద్వారా సంపూర్ణ సాధికారతను సాధిస్తాను.

ప్రభుత్వం నిర్దేశించుకున్న 15 అంశాలతో కుటుంబ వికాసం, 10 అంశాలతో సమాజ వికాసం, 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను స్వాగతిస్తున్నాను. వ్యక్తి వికాసంతోనే కుటుంబం వికసిస్తుంది. కుటుంబ వికాసంతోనే సమాజ వికాసం, తద్వారా రాష్ట్రం, దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని విశ్వసిస్తాను.

ఈ ఏడాది చివరినాటికి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్లతో తాగునీటి భద్రత ఇవ్వాలని, ఆహార భద్రతతో పాటు రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, బాల బాలికలకు పౌష్ఠికాహార భద్రత కల్పిస్తున్న ప్రభుత్వానికి సహకరిస్తాను. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న ఎన్టీఆర్ ఆశయ సాధనే ధ్యేయంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ‘అన్న క్యాంటీన్ల’కు నావంతు సహకారం అందిస్తాను. అర్హత గల అన్ని కుటుంబాలకు నూరుశాతం LPG కనెక్షన్లను అందజేయాలన్న గత ఏడాది సంకల్పాన్ని నూరుశాతం సాధించి గ్యాస్ భద్రత ఇవ్వడం మన ప్రభుత్వ కార్యదక్షతకు నిదర్శనంగా భావిస్తున్నాను.

రాష్ట్రంలో ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం కల్పించి, నిరంతరం సరఫరాతో విద్యుత్ భద్రత కల్పించడం, సమీప భవిష్యత్‌లో విద్యుత్ చార్జీలు పెంచడం లేదని భరోసా ఇవ్వడం సమర్ధపాలన ఫలితమేనని నమ్ముతున్నాను. నూరు శాతం ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సంకల్పించడాన్ని స్వాగతిస్తున్నాను. ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ అని ప్రభుత్వం చేపట్టిన మహోన్నత కార్యక్రమంలో నేనుసైతం ఒక సైనికుడిలా పాల్గొంటాను. మహిళల రక్షణను నావంతు బాధ్యతగా స్వీకరిస్తాను.

గ్రామీణ ప్రాంతాల్లో నూరుశాతం ఓడీఎఫ్ అమలు చేశామని, రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు నిర్మించి దేశానికే ఆదర్శంగా నిలిచామని, వీటి వినియోగంలోనూ అదే స్ఫూర్తి కనబరుస్తామని, ఈ సంవత్సరాంతానికి ఓడీఎఫ్ ప్లస్‌ దశకు చేరుకుని మన గ్రామాలు, పట్టణాలు, నగరాలు స్వచ్ఛంగా వుంచాలన్న ప్రభుత్వ లక్ష్యంలో నేను భాగస్వామి అవుతాను.2019 కల్లా ప్లాస్టిక్ వ్యర్థాలు లేని పరిశుద్ధ గ్రామాలను తీర్చిదిద్దడంలో పాలుపంచుకుంటానని మాటిస్తున్నాను.

గ్రామాలు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల రహదారులను అనుసంధానించడం, 17 వేల 600 కిలోమీటర్ల అంతర్గత సిమెంట్ రహదారుల నిర్మాణం పూర్తి చేయడం ప్రభుత్వం సాధించిన ఘన విజయాలు. ఇదే స్ఫూర్తితో ఈ ఆర్థిక సంవత్సరంలో 9,765 గ్రామ పంచాయతీలలో ఘన వ్యర్ధ పదార్థాల నిర్వహణ చేపట్టాలని, 24,783 శివారు గ్రామాల ప్రజానీకానికి ఒక్కొక్కరికి 55 లీటర్ల చొప్పున మంచినీటి సరఫరా చేయాలని ఈ ఏడాది ప్రకటించిన నూతన లక్ష్యాలను సాధించడానికి నావంతు సహకారం అందిస్తానని మహా సంకల్పం చేస్తున్నాను. ఏడాదిలో నావంతుగా కనీసం పదిమంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసి వారికి డిజిటల్, ఫిజికల్ లిటరసీలను కల్పించి, 2019 నాటికి చిన్నారులు నూరు శాతం పాఠశాలల్లో చేరేలా కృషి చేయడమే లక్ష్యంగా స్వీకరిస్తున్నాను.

మన పాఠశాలలు అన్నింటికీ ఫైబర్‌గ్రిడ్ ద్వారా వర్చువల్ తరగతులను ఏర్పరచాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తోడ్పాటునందిస్తానని మహా సంకల్పం చేస్తున్నాను. ఇంటింటికీ అందిస్తున్న ఫైబర్ కనెక్షన్ ద్వారా నిరంతర విద్యను అభ్యసిస్తూ మన జన్మభూమిని జ్ఞానభూమిగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తానని మహా సంకల్పాన్ని చేస్తున్నాను.

ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ పటిష్టమైన ప్రహరీ గోడలను నిర్మించి వాటి సంరక్షణ బాధ్యతలను స్వీకరిస్తాను. బడిలో ఆహ్లాదకర వాతావరణం సృష్టించడానికి తోడ్పడతాను. విద్యాలయాలకు అవసరమైన ఫర్నిచర్ సమకూర్చడంలో ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడానికి సహకరిస్తాను.

సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి, నిల్వ, పొదుపు తదితర విభాగాలలో వస్తున్న నూతన ఆవిష్కరణలను స్వాగతిస్తానని, రెండోతరం విద్యుత్ సంస్కరణలలో భాగంగా ‘ఇంటర్నెట్ ఆఫ్ పవర్’ వంటి పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి ఛార్జీలు తగ్గించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి సహకరిస్తాను. ‘వనం-మనం’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరం పది మొక్కలు నాటి మొత్తం 50 కోట్ల మొక్కలతో 2019 నాటికి రాష్ట్రంలో మూడోవంతు పచ్చదనం సాధించేందుకు శ్రమిస్తాను. రాష్ట్రంలో అందరికీ గృహవసతి కల్పించడంలో భాగంగా వచ్చే సంక్రాంతి నాటికి 19 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్న ప్రభుత్వ దృఢ సంకల్పానికి మద్దతిస్తున్నాను.

సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని విలువలతో కూడిన అవినీతి రహిత సమాజాన్ని సాధించేందుకు త్రికరణశుద్ధిగా శ్రమిస్తాను. డిజిటల్, క్లౌడ్ టెక్నాలజీ ద్వారా అత్యంత వేగంగా ప్రభుత్వ ధృవీకరణ పత్రాలను అందుకోవడంలో ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను, సులభతర పౌర సేవలను సద్వినియోగం చేసుకుంటానని, అందరూ వినియోగించుకునేలా అవగాహన పెంపొందిస్తానని సంకల్పం తీసుకుంటున్నాను.

‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌’లో ప్రథమస్థానాన్ని సాధించడమే కాక జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకున్నందుకు సంతృప్తి వ్యక్తం చేస్తూ, 2019 నాటికి ఈ అంశాలలో మన ప్రగతిని మరింత వేగవంతం చేసుకునేందుకు కృషిచేస్తాననే మహాసంకల్పం చేస్తున్నాను. సేవారంగంలో విస్తృతంగా వున్న ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటానని, ఫిన్‌టెక్, టూరిజం, బ్యాంకింగ్ రంగాల పురోగతికి నావంతు సహకారం అందిస్తానని మహా సంకల్పం చేస్తున్నాను. నిరుద్యోగులలో నిరాశా, నిస్పృహలను పారద్రోలడానికి భరోసాగా ప్రభుత్వం అందించనున్న నిరుద్యోగ భృతిని విజయవంతం చేస్తానని మహా సంకల్పం చేస్తున్నాను.

తెలుగుభాష, సంస్కృతులను కాపాడుకుంటూ, కూచిపూడి వంటి వారసత్వ కళారూపాల ఔన్నత్యాన్ని నిలబెట్టి గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించే వాతావరణం కోసం పాటుపడతాను. ప్రపంచ సంతోష సూచికలో ఆంధ్రప్రదేశ్‌ను అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి కృషి చేస్తాను.

ఈ నాలుగేళ్లలో మనం సాధించిన ఫలితాలను సుస్థిరం చేసుకుంటూ 2022కి దేశంలోని మూడు అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా, 2029కి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050కి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలిపేందుకు నావంతుగా ప్రయత్నిస్తానని మహాసంకల్పం చేస్తున్నాను.

''సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు’ అని మనకు ఎన్టీఆర్ ఇచ్చిన సందేశం నుంచి స్ఫూర్తి పొందుతూ ఆర్థిక సంస్కరణల ఫలాలను ప్రజలందరికీ అందించి, పేదరికం లేని, ఆర్థిక అసమానతలు లేని, ప్రశాంత, సురక్షిత, ఆనందదాయకమైన సమాజ నిర్మాణమే మన లక్ష్యం.’’ ఈ లక్ష్య సాధనే కర్తవ్యంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి సహకరిస్తానని మహాసంకల్పం చేస్తున్నాను.
Write Comments
Comments 8
Similar Updates