వేగం పుంజుకున్న ‘పోలవరం ప్రాజెక్టు’ నిర్మాణం
వేగం పుంజుకున్న ‘పోలవరం ప్రాజెక్టు’ నిర్మాణం

వేగం పుంజుకున్న ‘పోలవరం ప్రాజెక్టు’ నిర్మాణం

వేగం పుంజుకున్న ‘పోలవరం ప్రాజెక్టు’ నిర్మాణం

Monday, Nov 26, 2018
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు వేగం పుంజుకున్నాయని, కాంక్రీట్ పనులను సగానికి పైగా పూర్తిచేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జలవనరుల శాఖ అధికారులు వివరించారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొత్తం 61.43% పూర్తికాగా, కాంక్రీట్ పనులు 50.40%, తవ్వకం పనులు 81.51% పూర్తయ్యాయని తెలిపారు. సోమవారం సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై 83వ సారి ముఖ్యమంత్రి వర్చువల్ రివ్యూ నిర్వహించారు.

కుడి ప్రధాన కాలువ 90%, ఎడమ ప్రధాన కాలువ 65.79%, కాఫర్ డ్యామ్ పనులు 0.69%, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.98% పూర్తయినట్టు అధికారులు సమీక్షలో తెలిపారు. గతవారం స్పిల్ చానల్, స్పిల్ వే, పైలట్ చానల్, అప్రోచ్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి 5.67 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు, స్పిల్ వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 66 వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు జరిగాయని చెప్పారు. ఎగువ కాఫర్ డ్యామ్ డిజైన్లు ఆమోదం పొందగా, మరో వారం రోజుల్లో దిగువ కాఫర్ డ్యామ్ డిజైన్ల ఆమోదానికి అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అన్ని జిల్లాల నుంచి, అన్ని గ్రామాల నుంచి ప్రజలు, ఇంకా ఇంజినీరింగ్ విద్యార్ధులు పోలవరం సందర్శించేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. డిసెంబర్ నెలాఖరులోగా ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న కాలనీలు పూర్తికావాలని స్పష్టం చేశారు. గృహ నిర్మాణంలో అధికారులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే ఈనెలాఖరులోగా పరిష్కరించుకోవాలని చెప్పారు.

రూ. 3,216.65 కోట్లు బకాయిపడ్డ కేంద్రం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఇప్పటివరకు 15,079.78 కోట్లు కాగా, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత 9,943.91 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇంకా రూ.3,216.65 కోట్లు తిరిగి చెల్లించాల్సి ఉంది.

నిధుల ఏకీకరణపై సమీక్ష
మరోవైపు నరేగా నిధుల ఏకీకరణ(కన్వర్జన్స్)పైనా ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఈనెల 23 వరకు రూ. 5,873.19 కోట్లు వరకు నరేగా నిధులు వినియోగించామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. సీసీ రోడ్లు లక్ష్యం 8 వేల కి.మీ.గాను 5,758.09 కి.మీ. పూర్తి చేశామని తెలిపారు. అలాగే సోక్‌పిట్స్ లక్ష్యం-5,785 కాగా పూర్తి చేసినవి- 657, పంటకుంటలు లక్ష్యం-2,50,000 కాగా పూర్తయినవి-1,00,916, అంగన్‌వాడీ భవనాలు లక్ష్యం-6 వేలు కాగా, పూర్తయినవి-799, క్రీడా మైదానాలు లక్ష్యం-1,057 కాగా 518 పూర్తి చేసినట్టు వెల్లడించారు. పశుగణాభివృద్ధిపై మరింత దృష్టిపెట్టాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి, కమ్యూనిటీలు వారీగా పశువులకు సౌకర్యాలు కల్పించే ప్రయత్నం జరగాలన్నారు. మండలానికో గ్రామం చొప్పున ‘మోడల్ కమ్యూనిటీ పశువుల వసతిశాల’ను ఏర్పాటు చేయాలన్నారు.

సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ఏవీ రాజమౌళి, ఆర్&ఆర్ కమిషనర్ రేఖారాణి, ఈఎన్‌సీ వెంకటేశ్వరావు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Write Comments
Comments 8
Similar Updates